క‌రోనా వ‌ల్ల వేత‌నాల్లో కోత‌…

March 31, 2020

క‌రోనా వ‌ల్ల వేత‌నాల్లో కోత‌…

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, లాక్‌డౌన్ కార‌ణంగా ఎదుర‌య్యే ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బ‌య‌ట‌కు తెచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, ప్ర‌జా ప్ర‌తినిధుల వేత‌నాల్లో కోత విధించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. మార్చ్ 30వ తేదీన రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై తీవ్రంగా ప‌డుతుంద‌ని స‌మీక్షించారు. ఈ నేప‌థ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌టకు రావాలంటే ముందుచూపుతో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంద‌నే అభిప్రాయానికి ప్ర‌భుత్వం వ‌చ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌జా ప్ర‌తినిధుల వేత‌నాల్లో కొత విధించ‌డం ద్వారా కొంత ఆర్థిక లోటును పూడ్చుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఆర్థిక భారం కార‌ణంగా…
క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా ఆగిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైద్య సేవ‌ల‌ను సైతం మెరుగుప‌రుస్తోంది. కేవ‌లం క‌రోనా వైర‌స్ కోస‌మే ప్ర‌త్యేక వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. ఇదే స‌మ‌యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పేద‌ల‌కు ఉచిత రేష‌న్ అందించ‌డంతో పాటు కొంత న‌గ‌దును కూడా ఇవ్వ‌నుంది. ఇదంతా ప్ర‌భుత్వానికి ఆర్థికంగా భారం కానుంది. మ‌రోవైపు రైతుల‌ను సైతం ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో పండే ప్ర‌తీ పంట‌నూ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇది కూడా ప్ర‌భుత్వానికి తాత్కాలికంగా ఆర్థిక భారంగా మార‌నుంది.

10 శాతం నుంచి 75 శాతం వ‌ర‌కు
ఆర్థిక భారాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగులకు మార్చ్ నెల‌కు సంబంధించిన వేత‌నాల్లో కోత విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఐఏఎస్, ఐపీఎస్‌,, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భార‌త స‌ర్వీసుల అధికారుల‌కు ప్ర‌భుత్వం వేత‌నాల్లో 60 శాతం కోత విధించ‌నుంది. మిగ‌తా అంద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 50 శాతం వేత‌న కోత విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రిటైర్ ఉద్యోగుల‌కు ఇచ్చే పెన్ష‌న్ల‌లోనూ 50 శాతం కోత పెట్ట‌నుంది. నాలుగో త‌ర‌గ‌తి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేత‌నాల్లోనూ 10 శాతం, నాలుగో త‌ర‌గ‌తి రిటైర్డ్ ఉద్యోగుల పెన్ష‌న్ల‌లో 10 శాతం కోత విధించ‌నుంది. ప్ర‌భుత్వ రంగ‌, ప్ర‌భుత్వ గ్రాంటు పొందుతున్న ఉద్యోగుల‌కు కూడా ఈ సారి వేత‌నాల్లో 50 శాతం త‌క్కువ ఇవ్వ‌నున్నారు. కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కే కాకుండా ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఇచ్చే వేత‌నాల్లోనూ ప్ర‌భుత్వం కొత పెట్ట‌నుంది. ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్లు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల వేత‌నాల్లో 75 శాతం కోత విధించ‌నుంది.

మూడు శాఖ‌ల‌కు మిన‌హాయింపు
ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌న కొత‌లో మూడు శాఖల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మిన‌హాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. పోలీసు శాఖ‌, వైద్య ఆరోగ్య శాఖ‌, పారిశుద్ధ్య కార్మికుల‌కు వేతనాలు ఎప్ప‌టిలానే వేత‌నాలు ఇవ్వ‌నున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డానికి పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులుఉ తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ మేర‌కు వారి వేత‌నాల్లో కోత విధించ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.