పాలనా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పోస్టును పూర్తిగా రద్దు చేసేస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్ పోస్టును ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ పోస్టును తొలగించి ఒక్కో జిల్లాలో ఇద్దరు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో ఒకరు స్థానిక సంస్థలకు, మరొకరు రెవెన్యూ పాలనకు పని చేయనున్నారు. ఐఏఎస్ అధికారులతో పాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కూడా ప్రభుత్వం అదనపు కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న కొన్ని బదిలీలు చేయడంతో పాటు ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్లుగా ఉన్న వారిని అదే జిల్లాలకు అదనపు కలెక్టరుగా హోదా ఇచ్చింది.