బ‌రువు త‌గ్గండి ఇలా…!

February 12, 2020

అధిక బ‌రువు అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అధిక బ‌రువు ఉన్న వారు బ‌రువు త‌గ్గేందుకు చాలా ప్ర‌య‌త్నాలే చేస్తుంటారు. వ‌య‌స్సు త‌క్కువ ఉన్న వారికి ఇది చిన్న స‌మ‌స్యే అయినా 40 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్రం ఆరోగ్యప‌రంగా ఇబ్బంది త‌ప్ప‌దు. బ‌రువు త‌గ్గ‌డానికి నోరు క‌ట్టేసుకోవ‌డం, వ్యాయామాలు చేయ‌డం వంటివి చేస్తుంటారు. 4 – 5 కిలోల బ‌రువు త‌గ్గ‌గానే మ‌ళ్లీ ఈ ప్ర‌య‌త్నాల‌న్నీ ఆపేస్తుంటారు. బ‌రువు పెర‌గ‌డానికి కొన్ని ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. ఇందులో మొద‌టిది.. నాలుగేళ్ల వ‌య‌స్సు లోపు పిల్ల‌ల‌కు శ‌రీరంలో కొవ్వు సంచులు ఎక్కువ‌గా ఏర్ప‌డ‌టం. రెండోది.. జ‌న్యుప‌రంగా లావ‌య్యే ల‌క్ష‌ణాలు వ‌స్తాయి. మూడోది.. ఎక్కువ తినే అల‌వాటు ఉన్న వారు లావు అవుతారు. అయితే, ఎక్కువ శాతం అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు త‌క్కువ‌గా తినేవారే.

అధిక బ‌రువుకు మూడు కార‌ణాలు
జ‌న్యుప‌రంగా ల‌క్ష‌ణాలు ఉండే వారు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. కానీ ప‌సితనంలో కొవ్వు సంచులు ఏర్పాటు కాకుండా త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మ‌నం ప్రేమ‌గా పిల్ల‌ల‌కు పెట్టే ఆహారంలో మార్పులు అవ‌స‌రం. రుచిక‌రంగా ఆహారం పెడితే పిల్ల‌లు ఇష్టంగా తింటార‌నే ఉద్దేశ్యంతో నెయ్యి వంటివి వాడుతారు. దీని వ‌ల్ల అవ‌స‌రానికి మించి పిల్ల‌ల శ‌రీరంలో కొవ్వు సంచులు పేరుకుపోతాయి. త‌ల్లిదండ్రులు తెలియ‌క చేసిన ఈ త‌ప్పు పెద్ద‌య్యాక వారు లావు కావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. గ‌తంలో పిల్ల‌ల‌కు చిన్న నాటి నుంచే శారీర‌క శ్ర‌మ అల‌వాటు ఉండేది. దీంతో వారు బ‌లంగా ఉండే వారు. కానీ, ప్ర‌స్తుత జీవ‌న‌విధానంలో ఎవ‌రికీ పెద్ద‌గా శారీర‌క శ్ర‌మ ఉండ‌టం లేదు. దీంతో బ‌రువు పెరుగుతున్నారు. పిల్ల‌ల‌కు రుచి పేరుతో ఎక్కువ కొవ్వు ప‌దార్థాలు ఇవ్వ‌కుండా త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్తలు తీసుకుంటే పెద్ద‌య్యాక వారు అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డ‌రు.

కార్బోహైడ్రేట్స్ పూర్తిగా త‌గ్గించాలి
ఎక్కువ తినే అల‌వాటు ఉన్న వారు కూడా లావు అవుతుంటారు. ఎక్కువ తినే వారిలోనూ రెండు ర‌కాలు ఉంటారు. కొవ్వు ప‌దార్థాలు ఎక్కువ తింటేనే లావు అవుతారు అనేది కూడా అపోహ‌నే. మామూలు అన్నం ఎక్కువ తిన్నా బ‌రువు పెరుగుతారు. సాధార‌ణంగా కార్యాల‌యాల్లో పనిచేసే వారికి రోజుకు 2500 కార్బోహైడ్రేట్లు అవ‌స‌రం అవుతాయి. అంత‌కు మించి కార్బోహైడ్రేట్లు తిసుకుంటే కొవ్వుగా మారి శ‌రీరంలో పేరుకుపోతాయి. వాకింగ్‌, వ్యాయామాల ద్వారా ఒళ్లు తేలిక‌గా ఉండ‌టం, నొప్పులు లేకుండా ఉండ‌టం జ‌రుగుతుంద‌ని కానీ బ‌రువు మాత్రం ఎక్కువ‌గా త‌గ్గ‌రు. ఇందుకు కార‌ణం.. రోజూవారి ఆహారం నుంచి తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ నుంచే దీనికి ఎన‌ర్జీ ఖ‌ర్చ‌వుతుంది కానీ అప్ప‌టికే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు నుంచి కాదు. అందుకే ఆశ్ర‌మాల్లో ఆహారం తగ్గించి, నిమ్మ‌నీళ్లు – తేనే ఇచ్చి అప్పుడు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తారు. ఆహారం తిన‌డానికి మ‌నం పుట్ట‌లేద‌ని.. హాయిగా జీవించ‌డానికి ఆహారం తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు గుర్తించాలి. అవ‌స‌ర‌మైన మేరే ఆహారం తీసుకోవాలి. కొవ్వు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. కొవ్వు అంటే మాంసాహార‌మే కాదు.. నూనె, నెయ్యి, ప‌ప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం కూడా కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణం. అందుకే ఆకుకూర‌లు, కాయ‌కూర‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆహారం తీసుకుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఉద‌యం అల్ఫాహారంగా పండ్లు, రాత్రి పండ్లు, మ‌ధ్యాహ్నం ఉడికిన భోజనం తినాలి. అలా అయితే అధిక బ‌రువుతో బాధ‌ప‌డే అవ‌స‌ర‌మే ఉండ‌దు. పండ్ల‌లో నీటి శాతం, ఫైబ‌ర్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌. కాబ‌ట్టి పండ్లు ఎన్ని తిన‌గ‌లిగితే అన్ని తిన‌వ‌చ్చు.

ఆహారంలో మార్పులతోనే సాధ్యం…
మోకాళ్ల స‌మ‌స్య లేని వాళ్లు వాకింగ్ చేయ‌డం మించిదే కానీ వాకింగ్ ద్వారానే బ‌రువు త‌గ్గుతార‌నుకోవ‌డం మాత్రం భ్ర‌మే అవుతుంది. ఆహారంలో మార్పులు చేసుకోక‌పోతే వాకింగ్ చేసినా వృధానే. బ‌రువు త‌గ్గ‌డానికి జిమ్‌కు వెళితే బాగానే ఉంటుంది కానీ ఒక్క‌సారి జిమ్ ఆపేస్తే ముందున్న బ‌రువు కంటే ఎక్కువ‌వుతారు. జిమ్‌లో హార్డ్ ఎక్స‌ర్‌సైజ్ చేసిన వారికి అధిక ఆహారం తిన‌డం అల‌వాటు అవుతుంది. జిమ్ మానేసిన త‌ర్వాత కూడా అలానే తిని మ‌రింత బ‌రువు పెరుగుతారు. కాబ‌ట్టి, జిమ్‌కు వెళ్లి బ‌రువు త‌గ్గాల‌నుకోవ‌డం స‌రైన పద్ధ‌తి కాదు. ఇక‌, ఈత‌కు వెళ్లి బ‌రువు తాగ్గాల‌ని కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఈత‌, యోగా ఆరోగ్యానికి బాగా ఉప‌యోగం ఉంటుంద‌ని అమెరికాకు చెందిన ఓ ప‌రిశోధ‌న సంస్థ కూడా చెప్పింది. అయితే, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఈత‌కు వెళ్లిన వారు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. జిమ్‌కు వెళ్లిన‌ట్లుగానే ఈత చేసిన వారికి కూడా ఆక‌లి ఎక్కువ‌గా ఉంటుంది. ఆహారం ఎక్కువ తీసుకుంటారు. ఈత మానేసిన త‌ర్వాత అలానే ఆహారం తీసుకొని బ‌రువు పెరుగుతారు. కాబ‌ట్టి, ఆక‌లి పెంచ‌లి ప‌ద్ధ‌తి ద్వారా బ‌రువు త‌గ్గించుకోవాలి. దీనికి అద్భుత‌మైన ప‌ద్ధ‌తి యోగా. యోగాకు వెళుతూ ఆహారంలో మార్పులు చేసుకుంటే బ‌రువు సులువుగా త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాలనుకునే వారు రోజుకు క‌చ్చితంగా నాలుగు లీట‌ర్ల నీరు తాగాలి. ఉద‌యం, సాయంత్రం పండ్లు తినాలి. మ‌ధ్యాహ్నం రొట్టె, ఎక్కువ కూర తినాలి. కూర కూడా ఆకుకూర‌లు లేదా కాయ‌కూర‌లు తినాలి.

 

  • కేవై రామ‌చంద్ర‌రావు,
    సిద్ధార్థ యోగ విద్యాల‌యం