రైతు సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపిన తహశీల్దార్‌పై పూలవర్షం కురిసింది. ఏళ్ల నాటి తమ సమస్యను పరిష్కరించిన అధికారిని రైతులంతా భుజాలపై ఎత్తుకొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ రూరల్ మండలంలో ఈ సంఘటన జరిగింది. మండల పరిధిలోని మల్యాల, మాధవాపురం, అమనగల్ గ్రామాల్లో సర్వే నంబర్లలోని భూమికి, సాగు చేసుకుంటున్న భూమికి మధ్య తేడాలు ఉండటంతో రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. మొత్తం 414 సర్వే నెంబర్లలో 4,215 ఎకరాలకు సంబంధించి రైతులు అరవై ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నా పాస్ పుస్తకాలు మాత్రం లేవు.
దీంతో వారు రైతుబంధు, రైతుబీమాతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎటువంటి పథకాలను అందుకోలేకపోతున్నారు. తమ సమస్యను పరిష్కరించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులను వినవించినా లాభం లేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రాష్ట్రమంతా కొత్త పాస్ పుస్తకాలు అందించినా ఈ గ్రామాల రైతులకు మాత్రం అందలేదు. తాజాగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తహశీల్దార్ రంజీత్ కుమార్ చొరవతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఏళ్లుగా ఉన్న తమ సమస్యను పరిష్కరించిన తహశీల్దార్ రంజీత్‌కుమార్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనపై పూలవర్షం కురిపించి భుజాలపై ఎత్తుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.