సాదా బైనామాల క్రమబద్దీకరణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతులకు భూమి హక్కులకు సంబంధించి తీసుకున్న గొప్ప నిర్ణయం సాదాబైనామా క్రమబద్దీకరణ. తెల్లకాగితం / రిజిస్టర్డ్ కానీ దస్తావేజులు ద్వారా భూములు కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్న వారందరికీ మేలు చేకూరేలా జూన్ 2016లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సాదాబైనామాల ( రిజిష్టర్డ్ కాని కాగితాలు ) ద్వారా భూములు కొనుగోలు చేసి పట్టాలు లేక సాగుచేసుకుంటున్న రైతులు తెలంగాణలో కొన్ని వేలమంది ఉంటారు. వీరిలో ఎక్కువ మంది పేద చిన్న, సన్నకారు రైతులే. ఆర్. ఓ. ఆర్ చట్టం- (ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం , 1971 ) ప్రకారం, రిజిష్టర్డ్ కాగితాల ద్వారా భూమిని కొనుగోలు చేస్తేనే పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేస్తారు . రిజిష్టర్డ్ కాని కాగితాలు ( సాదాబైనామాల ) ద్వారా భూమిని కొనుగోలు చేస్తే పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేయడానికి వీలులేదు. కాని, ఈ విధంగా సాదాబైనామా ద్వారా 13- 12- 2000కు ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూములను కొనుగోలుచేసి భూమి సాగుచేసుకుంటున్న చిన్న , సన్నకారు రైతులు పట్టాలు పొందడానికి అవకాశం కల్పిస్తూ ఆర్ . ఓ . ఆర్ చట్ట సవరణ చేయడం జరిగింది . ఈ చట్ట సవరణ ప్రకారం సాదాబైనామా క్రమబద్దీకరణ చేసి పట్టా పొందాలంటే భూమి – కొనుగోలు 31- 12- 2000 కన్నా ముందు జరిగి ఉండాలి. కొనుగోలు చేసిన భూమి గ్రామీణ వ్యవసాయ భూమి అయి ఉండాలి. ప్రభుత్వం విధించిన గడువులోగా ఫారం- 10 లో దరఖాస్తు చేసుకోవాలి. భూమి కొనుగోలు చేసిన నాటి భూమి విలువ ఆధారంగా నిర్ణయించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విదించిన చివరి గడువు 28- 2-2009 నాటికి ముగిసింది. కాని ఇంకా ఎన్నో వేలమంది పేద రైతులు సాదాబైనామా క్రమబద్దీకరణ చేయించుకోలేక పట్టాలు పొందలేకపోయారు.