టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటే ఏమిటి ? ప్రస్తుతం మన వద్ద ఉన్న రికార్డులకు , దీనికి తేడా వివరిస్తారా ?
ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ఇప్పటికే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అమలులో ఉంది. భూమికి సంబంధించి పూర్తి భద్రతతో యాజమాన్య హక్కులు కల్పించడాన్నే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటున్నాం. ప్రస్తుతం మనదేశంలో ఇండియన్ ఎవిడెన్స్ చట్టం – 1872 కింద యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లేదు. భూమి లేదా ఏదైనా ఆస్తి ఒక వ్యక్తి పేరుపై రిజిస్టరు చేసి ఉన్నా కూడా ఆ వ్యక్తే సదరు భూమికి అనలైన యజమాని అని పూర్తి రుజువు కాదు. 1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం టైటిల్ ను రిజిస్టరు చేయరు. కేవలం దస్తావేజులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో పాటు ఆస్తి లావాదేవీ న్యాయబద్ధత గురించి కూడా స్పష్టత లేదు. భూయాజమాన్య హక్కుకు భద్రత లేనందున భూయాజమాన్యానికి సంబంధించి అనేక వివాదాలు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. దీంతో భూమికి సంబంధించి అభద్రతతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు అందాల్సిన ప్రోత్సాహకాలు కూడా తగ్గుతాయి. ఇది సుస్థిరమైన , వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతుంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ మూడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటుంది.
1 . మిర్రర్ ప్రిన్సిపల్ – రిజిస్చీలో క్షేత్రస్థాయిలో కచ్చితంగా ఒకే వరిస్థితి ఉండటం
2 . కర్టిన్ ప్రిన్సిపల్ – కచ్చితమైన , నమ్మదగిన టైటిల్ రిజిస్ట్రీ.
3 . అష్యూరెన్స్ ప్రిన్సిపల్ – రిజిస్ట్రీలో లోపాల కారణంగా, ఎవరైనా వ్యక్తి వల్ల కలిగే నష్టానికి పరిహారం అందించేలా ప్రభుత్వం హామీ ఇవ్వడం.