ఆస్తి సంప‌ద‌గా మారాలంటే…… భ‌ద్ర‌మైన హ‌క్కులుండాలి…

April 2, 2020

ఆస్తి సంప‌ద‌గా మారాలంటే
భ‌ద్ర‌మైన హ‌క్కులుండాలి…

పశ్చిమ దేశాలలో పెట్టుబడిదారి వ్యవస్థ విజయం సాధిస్తే ఇతర దేశాలలో ఎందుకు విఫలం చెందుతుంది అనే ప్రశ్నకు సమాధానాలు ఇస్తూ ఆస్తి హక్కులపై విస్తృత అధ్యయనం చేసిన ‘ పేరూ ‘ దేశ ఆర్థికవేత్త హెర్నాండో డిసోటో 2000 సంవత్సరంలో రాసిన పుస్తకం” పెట్టుబడి రహస్యం( the mystery of capital ). పెట్టుబడిదారీ వ్యవస్థ విజయం సాధించాలంటే ప్రజల దగ్గర ఉన్న ఆస్తి సంపదగా మారాలి. అలా మారాలంటే ప్రజలకు స్పష్టమైన, భద్రమైన ఆస్తి హక్కులు ఉండాలి అనేదే ఈ పుస్తకంలోని కీలక వాదన. పెట్టుబడిదారీ వ్యవస్థకు కీలకం మూలధనం లేదా పెట్టుబడి. దీని చుట్టూ ఐదు రహస్యాలను ఈ పుస్తకంలో చర్చించాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 80 % ప్రజలకు ఆస్తిపై చట్టబద్ధంగా లావాదేవీలు జరిపే అవకాశాలు లేవు. భూమి, ఇల్లులు మొదలగు ఆస్తులపై స్పష్టమైన హక్కులు వీరికి లేవు. ఎవరికీ యాజమాన్య హక్కులు ఉన్నాయో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. భూమిపై హక్కులు పొందాలంటే ఈ దేశాలలో చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది సంపద సృష్టికి ప్రధాన అడ్డంకి. చట్టబద్ధమైన హక్కులు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పేదలు కలిగి ఉన్న భూముల విలువ దాదాపు పది ట్రిలియన్ డాలర్లు. ఇది అమెరికాలో వాడుకలో ఉన్న డబ్బుకు లో రెండింతలు. పేదలు తమ ఆస్తులను పెట్టుబడి పెట్టడానికి, మరో రకంగా వినియోగించుకోవడానికి చట్టబద్ధ హక్కులు లేకపోవడం అడ్డంకిగా మారింది. రాజకీయ నాయకత్వం ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నారు. ఈ ఆస్తులకు వారికి చట్టబద్ధమైన హక్కులు వస్తే వారి సంపద అనుహ్యంగా పెరుగుతుంది . ఏ దేశంలోనైతే ప్రజలకు తమ భూమిపై స్పష్టమైన, భద్రమైన హక్కులు ఉంటాయో ఆ దేశంలో ప్రజల సంపద పెరుగుతుంది. కాబట్టి, చట్టాలలో తగిన మార్పులు తేవాలి. పెట్టుబడికి అనువైన రాష్ట్రంగా ఉండటంకోసం నేడు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పెట్టుబడి అనువైన ప్రాంతం ( Ease of doing business ) ర్యాంకుల కోసం విపరీతమైన పోటీ జరుగుతుంది . వీటిలో మంచి ర్యాంక్ రావాలంటే భూపరిపాలన మెరుగు కావడం , భూమి హక్కులు స్పష్టంగా , భద్రంగా ఉండటం , భూమి హక్కులు పొందే ప్రక్రియ సులభతరంగా ఉండటం , సత్వర భూవివాద పరిష్కార వ్యవస్థ ఉండటం తప్పనిసరి .