వార‌స‌త్వం భూమికి ప‌ట్టా పొంద‌డ‌మెలా ?

March 27, 2020

వార‌స‌త్వం భూమికి ప‌ట్టా పొంద‌డ‌మెలా ?

1 . భూమి వారసత్వంగా పొందిన వ్యక్తి ఫారం . 6ఎ లో తహశీల్దారుకు దరఖాస్తు చేయాలి . ( సెక్షన్ 4 ( 1 ) ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు అండ్ పట్టాదారు పాసు పుస్తకముల చట్టం , 1971 అండ్ రూల్ 18 , ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు అండ్ పట్టాదారు పాసు పుస్తకముల రూల్స్ , 1989 ) దరఖాస్తుతో పాటు అడంగల్ / పహాణీ నకలు , పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ నకలు , నాలుగు ఫోటోలు (వారసత్వంగా భూమిని పొందుతున్న వ్యక్తికి ఇదివరకే పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ లేనట్లయితే ) జతచేయాలి .

2 . దరఖాస్తు అందిన తరువాత తహశీల్దారు కార్యాలయం దరఖాస్తుదారునికి ఫారం 6సి లో రశీదు ఇస్తుంది . ( సెక్షన్ 4 ( 1 ) , రూలు 18 ( 1 ) )

3 . తహశీల్దారు సంబంధిత వ్యక్తులకు ఫారం – 8 లో నోటీసులు ఇస్తారు . ఈ నోటీసు ప్రతిని గ్రామ పంచాయతీ కార్యాలయం , గ్రామ చావిడి , తహశీల్దారు కార్యాలయం , మండల్ పరిషత్ కార్యాలయంలోని నోటీసు బోర్డులలో ఉంచుతారు . ( సెక్షన్ 5 ( 3 ) , రూలు 19 )

4 . నోటీసులో నిర్దేశించిన తేదిలోగా సంబంధిత వ్యక్తులు తమ అభ్యంతరాలు ఏమైన ఉన్నట్లయితే తెలియచేయాలి . అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే తెలియచేయటానికి నోటీసు ఇచ్చిన తేది నుండి కనీసం 30 రోజుల సమయం ఇస్తారు . ( రూలు 19 ( 1 ) )

5 . నిర్దేశించిన తేది నాడు తహశీల్దారు విచారణ నిర్వహిస్తారు . నోటీసు ఇచ్చిన నాటి నుంచి కనీసం 45 రోజుల తరువాతనే విచారణ చేస్తారు . సంబంధిత పత్రాలను పరిశీలన చేస్తారు . ( రూలు19 ( 1 ) అండ్
( 20 ) )

6 . ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే , పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేస్తారు .

7 . ఒక వేళ భూమి సబ్ డివిజన్ అవసరమైనట్లయితే చేయించుకోవడానికి నిర్దేశించిన రుసుం ( ప్రతి సర్వే నెంబరు 250 రూపాయలు ) చాలాను ద్వారా ప్రభుత్వానికి చెల్లించి , చాలాను నకలును జతచేస్తూ తహశీల్దారుకు దరఖాస్తు చేయాలి . ( రూలు 14 ( 4 ) )

8 . సబ్ డివిజన్ జరిగిన తరువాత తహశీల్దార్ పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీచేస్తారు .

9 . తహశీల్దారు కార్యాలయం ఫారం 1 , 1బి , VII రిజిస్టర్లలో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ తయారు చేస్తారు ( సెక్షన్ 10ఎ అండ్ రూలు 30 )

10 . పట్టాదారు పాసు పుస్తకములో వారసత్వంగా భూమిని పొందిన వ్యక్తి గ్రామ రెవెన్యూ అధికారి , తహశీల్దార్ సంతకాలు చేస్తారు . టైటిల్ డీడ్ లో వీరితోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి ( ఆర్డీఓ ) సబ్ రిజిస్ట్రార్ కూడా సంతకాలు చేస్తారు .

11 . ఫారం – 17లో పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకొని వాటిని వారసత్వంగా భూమి పొందిన వ్యక్తికి అందచేస్తారు .

12 . గ్రామ రెవెన్యూ అధికారి అడంగల్ / పహాణీ – పట్టాదారు పాసుపుస్తకము , టైటిల్ డీడ్ పొందిన వ్యక్తి పేరు నమోదుచేస్తారు . ( సెక్షన్ 10ఎ అండ్ రూలు 30)