హైదరాబాద్ రాష్ట్రంలో నాటి పరిస్థితి . . .

March 30, 2020

హైదరాబాద్ రాష్ట్రంలో నాటి పరిస్థితి . . .

హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా ఉన్న సాలార్‌జంగ్ 1864లో హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిసారిగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్థాపించారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రం ఆరు ప్రాంతాలు ( సుబాలు ) గా విభజింపబడి ఉండేది. ఒక్కొక్క సుబా సర్కార్లు ( డివిజన్లు ) గా, ప్రతి సర్కారు తాలూకాలు ( జిల్లాలు ) గా విభజింపబడ్డాయి. ప్రతి సుబా ఒక సుబేదారు ఆధీనంలో ఉండేది. అప్పటి తాలూకా అంటే ఇంచుమించు ఇప్పటి జిల్లాతో సమానం. ప్రతి తాలుకా తాలుక్ దారు అనే అధికారి ఆధీనంలో ఉండేది. ఈ తాలూక్ దారు ప్రస్తుత జిల్లా కలెక్టరు స్థాయి అధికారి. వారికి వసూలు చేసిన పన్నుపై కమీషను రూపంలో వేతనం చెల్లించేవారు. వారి హూదా పలుకుబడి ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వానికి ‘ నజరు ‘ చెల్లించే షరతుపై వారిని ఈ పదవులలో నియమించినట్లు తెలుస్తుంది . కానీ వారు హైదరాబాద్లోనే నివసిస్తూ, పన్ను వసూలు చేసే బాధ్యతలను నాయిబ్ ( డిప్యూటీ తహశీల్దారు ) అనే అధికారికి అప్పగించారు . విధి నిర్వహణలో అశ్రద్ధ చూపినందు వలన, బ్రిటీషు సామ్రాజ్యంలోని హైదరాబాదు రెసిడెంటు కమిషనర్ తాలూక్ దార్ల విధి నిర్వహణను పర్యవేక్షించుటకు బ్రిటీషు అధికార్లను నియమించారు. 1830వ సంవత్సరంలో బ్రిటీషు అధికార్లను తొలగించి వారి స్థానంలో అమీన్లు ‘ అనబడే అధికార్లను నియమించారు. కానీ విధి నిర్వహణలో ప్రతిభ లేకపోవడం వలన 1840వ సంవత్సరంలో వారిని తొలగించారు. 1855వ సంవత్సరంలో సాలార్‌జంగ్ ప్రప్రథమంగా వేతనం చెల్లించే విధంగా తాలూ దార్లను నియమిస్తూ పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1865వ సంవత్సరంలో “ జిల్లా బందీ ” విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రం మొత్తాన్ని 14 జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక అవల్ తాలూక్ దార్ ( జిల్లా కలెక్టరు ) ను నియమించి , ఆయనకు సహాయం చేయుటకు డోయమ్ తాలుక్ దార్ ( సబ్ కలెక్టరు రె. డి. అ ) ను నియమించారు. ఇక మూడో తరగతి అధికారులుగా సోయమ్ తాలుదార్లను నియమించారు. ఈ అధికారులు ప్రస్తుత తహశీల్లార్ల స్థాయి అధికారులు.