1-బి రిజిస్టర్ (ఆర్ ఓ ఆర్)
గ్రామ రెవెన్యూ రికార్డుల అవసరం లేకుండా రైతులకు రుణ సదుపాయాలు చేకూర్చుటకు ప్రభుత్వేతర భూములు , వ్యవసాయ భూములకు సంబంధించిన హక్కుదారుల వివరాలను తయారుచేసి , వాటిని ఎప్పటికప్పుడు సరిచేసి / తాజా పరిచి , వాటి ఆధారంగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయుటకొరకు తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాసు పుస్తకాలు చట్టం, 1971 తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం సర్వే సెటిల్మెంట్ కమిషనర్ గారి నోటిఫికేషన్ వెలువడిన తరువాత, రికార్డింగ్ అథారిటీ భూమి హక్కుదారుల నుండి ఫారం – 1 లో క్లెయిమ్ లను తీసుకుని బహిరంగ విచారణ జరిపి ఫారం – 1లో డ్రాఫ్ట్ భూమి హక్కుల రికార్డ్ తయారు చేస్తారు . ఈ డ్రాఫ్ట్ రికార్డును గ్రామంలో ప్రచురించి అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిపై విచారణ జరిపి భూమి హక్కుల రికార్డును తయారుచేస్తారు . ఈ తయారుచేసిన భూమి హక్కుల రికార్డును ( ఫారం – 1 ) బట్టి పట్టాదారు వారిగా ఫారం 1బి రిజిస్టరు తయారుచేస్తారు . రిజిస్టరు ఆధారంగా పట్టాదారు పాసు పుస్తకము , టైటిల్ డీడ్ తయారుచేసి సంబంధిత భూమి హక్కుదారులకు ఇస్తారు . ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1బి రిజిస్టర్ లోని తప్పులను సవరించి , కొత్త పాసు పుస్తకము , టైటిల్ డీడ్ కలిపి ఒకే పుస్తకంగా ప్రతి భూయజమానికి అందజేసారు .
– 2017 లో తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాసు పుస్తకాలు చట్టం , 1971 కి సవరణ చేసి , కంప్యూటర్ లో పొందుపరిచిన 1బి రిజిస్టర్ కి కుడా చట్టబద్ధత కల్పించడం జరిగింది.
– 1బి రిజిస్టరు నందు మొత్తం 15 కాలము ఉంటాయి .
– గ్రామములో ఒక భూమి యజమానికి ఎంత భూమి ఉన్నదో ఖాతా నెంబర్ వారిగా తెలియజేసేదే 1బి రిజిస్టరు .
– ఈ రిజిస్టర్ నందు ఖాతా నెంబర్ వారిగా భూయజమాని పేరు , ఏ ఏ సర్వే నెంబర్ల నందు ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నారో తెలియజేస్తుంది.
-భూయజమానికి 1బి రిజిస్టరు లో పేరు నమోదు చేసిన తరువాతనే పట్టాదారు పాసు పుస్తకము ఇస్తారు .