భూములను అమ్మడానికి వెళ్లినప్పుడు ఈ భూములు రిజిస్ట్రేషన్ కావని, నిషేధిత జాబితాలో ఉన్నాయనే సమాధానం వస్తోంది. ఇలాంటి సమస్యలను వేల మంది రైతులు ఎదుర్కుంటున్నారు. ఇంకా అనేక వేల మందికి తమ భూములకు ఈ సమస్య ఉందనే విషయం కూడా తెలియదు. నిషేధిత జాబితా భూముల జాబితాను సెక్షన్ 22ఏ లిస్టు అంటారు. ఎవరి భూమి అయినా ఈ జాబితాలోకి చేరితే ఒక ఆ భూమి రిజిస్ట్రేషన్ జరగదు. ఒక అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 – 40 లక్షల ఎకరాల పట్టా భూమి కూడా ఈ జాబితాలో చేరిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంకా చాలా మందికి అసలు తమ భూమి ఈ నిషేధిత జాబితాలో ఉందనే విషయమే తెలియదు. ఎప్పుడో ఒకసారి తెలిసే నాటికి సమస్యను పరిష్కరించుకోవడం మరింత జఠిలమవుతుంది.
రిజిస్ట్రేషన్లకు వీలు లేదని జాబితా
కొన్ని రకాల భూములు అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. ఉదాహరణకు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అమ్మడం సాధ్యం కాదు. అసైన్‌మెంటు భూములను సాగు చేసుకోవచ్చు కానీ అమ్మడానికి వీలు లేదు. గిరిజన ప్రాంతాల్లో భూములు, సీలింగ్ మిగులు భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు వంటివి అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. అయినా చాలా సందర్భాల్లో ఈ భూములు అమ్మడాలు, కొనడాలు జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. ఇలా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకు 1999లో రిజిస్ట్రేషన్ చట్టానికి ఒక సవరణ తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రకటించే కొన్ని రకాల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని ఒక సెక్షన్ పెట్టారు. కానీ, ఈ చట్టాన్ని 2003లో హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇదే సెక్షన్‌ను మరో రూపంలో 2007లో రిజిస్ట్రేషన్ చట్టంలో చేర్చారు. ఇదే సెక్షన్ 22ఏ. ఐదు రకాల భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని ఈ సెక్షన్ చెబుతోంది.
ఐదు కేటగిరీల్లో సెక్షన్ 22ఏ భూముల జాబితా
22ఏ సెక్షన్‌లో పెట్టిన ఐదు కేటగిరీలు ఏంటంటే.. కేటగిరి ఏ – ఏదైనా చట్టం గనక ఆ భూమి అన్యాక్రాంతం లేదా బదలాయింపు నిషేధిస్తే ఇటువంటి భూముల రిజిస్ట్రేషన్ చేయకూడదు. అసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం అసైన్‌మెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. ఎల్‌టీఆర్ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరుల పేరుపైకి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్స్ చట్టాల ప్రకారం ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చేయవద్దు. కేటగిరి బీ – ప్రభుత్వ భూములకు సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. కేటగిరి సీ – దేవాదాయ శాఖ, వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. కేటగిరి డీ – ఈ కేటగిరిలో సీలింగ్ మిగులు భూములు ఉంటాయి. కేటగిరి ఈ – ప్రభుత్వం సేకరించే భూములు, కోర్టు అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములు. ఈ ఐదు కేటగిరీలలో జాబితాలు తయారుచేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేస్తారు. దేవాదయ భూములను దేవాదయ శాఖ, వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డు, మిగతా భూములను రెవెన్యూ అధికారులు జాబితా తయారు చేస్తారు. ఐదో కేటగిరిలోని భూములను మాత్రం ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా జాబితాలో చేరుస్తుంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, ఆన్‌లైన్‌లో ఈ జాబితా అందుబాటులో ఉంటుంది. ఈ జాబితాలోని సర్వే నంబరుపై ఏ డాక్యుమెంట్ రాసుకున్నా అది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. సేల్ డీడ్, దానపత్రం, భాగపంపకాలు, జీపీఏ తదితర ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా జరగదు. ఒకవేళ పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగినా ఆ డాక్యుమెంట్‌పై ఎటువంటి హక్కులు చెల్లవు. 2007లో ఈ సెక్షన్ రాగా, 2008 నుంచి ఈ జాబితాలు రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖకు పంపించారు.
అందుబాటులో నిషేధిత భూముల జాబితా
అందరూ తమ భూములు ఈ జాబితాలో ఉన్నాయా అనేది ముందుగా పరిశీలించుకోవాలి. ఈ జాబితా సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఉంటాయి. దేవాదయ శాఖ భూములు దేవాదయ శాఖ వద్ద, వక్ఫ్ భూముల జాబితా వక్ఫ్ బోర్డు వద్ద ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అయితే పూర్తి జాబితా ఉంటుంది. ఈ రెండూ కాకుండా.. ఆన్‌లైన్‌లోనూ ఈ పూర్తి జాబితాను అందుబాటులో ఉంచారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి జిల్లా పేరు, మండలం, రెవెన్యూ గ్రామం సెలక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఏయే సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయో చూసుకోవచ్చు. కోర్టుల్లో సాక్షంగా చూపించేందుకు సర్టిఫైడ్ కాపీ కావాలంటే సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో లేదా మీసేవా నుంచి తీసుకోవచ్చు. చాలా మందికి తమ భూమి ఈ జాబితాలో ఉందో లేదో తెలియదు. కాబట్టి, అందరూ తమ భూములు ఈ జాబితాలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోయినా ఈ జాబితాను తీసి పెట్టుకోండి. భవిష్యత్‌లో భూమిని ఈ జాబితాలో చేర్చినా ఇంతకుముందు లేదు అని చూపించేందుకు ఇది ఆధారంగా పనికొస్తుంది. ఒకవేళ పట్టా భూమి అయి ఉండి 22ఏ జాబితాలో చేరిస్తే వెంటనే జాబితా నుంచి తొలగించుకోవాలి. లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయి.
నిషేధిత జాబితాలో పొరపాట్లు
2007లో సెక్షన్ 22ఏ అమలులోకి వచ్చినప్పుడు ఈ జాబితా తయారు చేయాల్సిందిగా అన్ని రెవెన్యూ కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ జాబితా తయారుచేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరాయి. తప్పుగా ఈ జాబితాలో చేరడం ఒకటయితే, ఒకే సర్వే నంబరులో పట్టా భూమి, రిజిస్ట్రేషన్ నిషేధ భూమి ఉన్నప్పుడు ఈ సర్వే నంబరు మొత్తం నిషేధ జాబితాలోకి వెళ్లిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ జాబితాను సెటిల్‌మెంట్ రికార్డు ఆధారంగా సేత్వార్, ఖాస్రా పహాణి, చేసాల పహాణి ఆధారంగా రూపొందించారు. ఆ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఇప్పుడు మారి ఉండవచ్చు. కానీ, ఈ సర్వే నంబరు మొత్తం నిషేధిత జాబితాలోకి చేరిపోయి ఉంటుంది. కొన్ని రకాల అసైన్‌మెంట్ భూములను అమ్ముకోవడానికి వీలవుతుంది. కానీ, అవి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇలా రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. వీటి పరిష్కారానికి హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను ఇచ్చింది. సెక్షన్ 22ఏలోని మొదటి నాలుగు కేటగిరిల్లో తమ పట్టా భూమి ఉంటే ఈ జాబితా నుంచి తొలగించాల్సిందిగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నిషేధిత జాబితాను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ఒకవేళ ఎవరి పట్టా భూమి అయినా ఐదో కేటగిరిలో ఉంటే ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీలో ఒక రెవెన్యూ అధికారి, ఒక సర్వే సెటిల్‌మెంట్ అధికారి, ఒక రిటైర్ జిల్లా జడ్జి ఉంటారు. ఈ కమిటీ నిర్ణయంపై హైకోర్టుకు కూడా వెళ్లవచ్చు. దీంతో పాటు ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ పట్టా భూమి అని సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. సివిల్ కోర్టు ఇచ్చే ఆర్డర్ ఆధారంగానూ నిషేధిత జాబితాలో మార్పులు చేయవచ్చు. ప్రతీ జిల్లా కార్యాలయంలో కొన్ని వందల పిటీషన్లు సెక్షన్ 22ఏ నుంచి తమ భూములు తొలగించాలనే వినతులు వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ సమావేశాలు జరగకపోవడం వల్ల కూడా చాలా కేసులు హైకోర్టుకు కూడా వస్తున్నాయి.
రైతులకు సూచనలు
రైతులు తమ పట్టా భూమి నిషేధిత జాబితాలో ఉంటే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తమ భూమిని తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదో కేటగిరిలో ఉన్న తమ భూమి ఉన్న వారు రాష్ట్ర స్థాయిలోని త్రిసభ్య కమిటీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ న్యాయం జరగకపోతే సివిల్ కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సంబంధిత అధికారుల వద్ద నెలలు గడుస్తున్నా ఈ దరఖాస్తుల పరిష్కారం కావడం లేదు. కానీ, ఆరు వారాల్లోనే అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రకటించాలి. నిర్ణయాన్ని ప్రకటించే ముందు కేవలం రికార్డులు పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తే దరఖాస్తు దారుడికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, దరఖాస్తుదారుడి వాదన కూడా విన్నాక మాత్రమే అధికారులు ఈ దరఖాస్తులపై నిర్ణయాన్ని ప్రకటించాలి.
- ఎం.సునీల్ కుమార్,
భూచట్టాల నిపుణులు