జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని అందరమూ కోరుకుంటాము. అయినా చిన్నదో, పెద్దదో జబ్బులు మనలో చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ జబ్బుల గురించి ఆలోచిస్తూ మనం ఒత్తిడికి గురవుతున్నాము. జబ్బుల వల్ల భయపడుతున్నాయి. జబ్బుల కంటే కూడా మన భయమే ఇంకా మనకు ప్రమాదకరంగా మారుతోంది. మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ జబ్బుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. జబ్బు ఎందుకు వచ్చింది ? పరిష్కారం ఏంటి ? అనేది ఆలోచించుకుంటే జబ్బులకు భయపడాల్సిన పని లేదు. మొత్తం జీవరాసుల్లో అత్యంత తెలివైన మనకు ఇన్ని రోగాలు ఉన్నాయి కానీ ఇతర జంతువులకు ఏ జబ్బూ ఎందుకు రావడం లేదని ఆలోచించుకోవాలి. ప్రకృతిని, మన శరీరాన్ని అర్థం చేసుకొని, సరైన పరిష్కారాన్ని ఎంచుకుంటే ఏ జబ్బు అయినా వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎంత తీవ్రమైన జబ్బుని అయినా మూడు నుంచి ఆరు నెలల పాటు దృష్టి పెడితే వదిలించుకోవచ్చు. మనతో పాటు అన్ని జీవరాశులను తయారుచేసింది ప్రకృతి. మనం జీవించడానికి అవసరమైన వనరులను అన్నీ ప్రకృతి మనకు అందించింది. కానీ జంతువులు ప్రకృతిసిద్ధంగా జీవిస్తున్నాయి, మనము మాత్రం కృత్రిమ జీవనం వైపు వెళుతున్నాం. జబ్బులకు పునాధి పడేది ఇక్కడే. సహజంగా జీవించే జంతువులు, పక్షులకు జబ్బులేమీ లేవు కాబట్టి మనము కూడా సహజంగా జీవిస్తే జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మన జీవన విధానంలో చిన్న మార్పుల ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. 15 రోజుల పాటు డైట్ షీట్‌ను ఫాలో అయితే జబ్బుల
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
ఉదయం లేవగానే రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. పడిగడుపున ఖాళీ జీర్ణకోశంలోకి నీళ్లు వెళితే అందులో మురికి శుద్ధి అవుతుంది. ఈ నీళ్లు పది నిమిషాలు శరీర వేడికి సమానంగా వేడవుతాయి. పది నిమిషాల పాటు ఫిల్టర్ అవుతాయి. తర్వాత జీర్ణకోశపు గోడల ద్వారా రక్తంలో కలుస్తాయి. రక్తంలో కలిసిన ప్రతీ చుక్క శరీరంలోని ప్రతీ అణువులోకి వెళుతుంది. ప్రతీ జీవకణంలోని కెమికల్ వేస్ట్‌ను కలుపుకొచ్చి కిడ్నీల వద్ద ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్లిపోతుంది. పొద్దున మనం శరీరం బయట ఎలా క్లీన్ చేసుకుంటామో శరీరం లోపల క్లీన్ చేస్తుంది ఈ రెండు గ్లాసుల నీరు. వ్యక్తిగత పనులు పూర్తయిన తర్వాత మళ్లీ రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. టిఫిన్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. నూనెలో వేయించిన టిఫిన్లు కాకుండా ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పులిహోర, దోశ వంటి టిఫిన్ చేశారు. వీటిలో చిన్న మార్పు చేసుకోవాలి. ఉదాహరణకు ఇడ్లీని ఆరోగ్యకర ఇడ్లీగా మార్చుకోవాలి. అంటే.. పొట్టు మినపప్పును వాడాలి. పొట్టు కింద పైపొరలోనే సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి. ఇడ్లీ రవ్వ బదులు జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఒరిగెలు, ఊదలు వంటి మిల్లెట్స్‌లో మీకు నచ్చిన వాటితో రవ్వను చేసుకోవాలి. ఇడ్లీ వేసే ముందు రెండుమూడు క్యారెట్లను తురిమి ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా క్యారెట్‌లో, మిల్లెట్స్‌లో, పొట్టుపప్పులో ఉండే పోషకాలు అన్నీ కలిసి ఆరోగ్యకరమైన ఇడ్లీగా మార్చుకోవచ్చు. రుచి కూడా బాగుంటుంది. ఇడ్లీనే కాకుండా ఇతర టిఫిన్లను కూడా ఇలానే ఆరోగ్యకరంగా మార్చుకోవాలి.
అన్నం తగ్గించాలి.. కూర పెంచాలి
టిఫిన్ నుంచి భోజనానికి మధ్యలో గంటకు ఒక గ్లాస్ చొప్పున నీళ్లు తాగాలి. ఇలా చేయడం ద్వారా టిఫిన్ అరిగి శరీరానికి అందులోని పోషకాలు బాగా అందుతాయి. భోజనానికి అరగంట ముందు రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. తిన్న ఆహారాన్ని అరిగించడానికి అవసరమైన జీర్ణరసాలు ఊరడానికి ఈ రెండు గ్లాసుల నీళ్లు పని చేస్తాయి. భోజనం ముగిశాక గంటన్నర తర్వాత ప్రతీ గంటకు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. ఇలా చేయడం ద్వారా ఆహారంలోని పోషకాలు రక్తంలోకి కలుస్తాయి. అన్నం తినేటప్పుడు 50 శాతం అన్నం, 50 శాతం కూర ఉండేలా చూసుకోవాలి. కనీసం ఇప్పుడు తింటున్న కూరకు రెట్టింపు అయినా తినాలి. మనం ఎక్కువగా తినే అన్నంలో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఎనర్జీ ఉంటుంది. సాధారణ ఉద్యోగాలు చేసే వారికి రోజుకు 2500 కేలరీల ఎనర్జీ అవసరం. చాలా కష్టపడే వారికి 3000 కెలరీల ఎనర్జీ అవసరం. ఒక్క అన్నం ముద్దలో 100 కేలరీల ఎనర్జీ ఉంటుంది. అంటే మనము రోజుకు 25 అన్నం ముద్దలు తింటే సరిపోతుంది. అంటే ఒక్క పూటకు ఏడెనిమిది ముద్దలు తింటే చాలు. కానీ మనం ఒక్క పూటకు కనీసం 25 – 30 ముద్దల అన్నం తింటాం. ఇలా అదనంగా శరీరంలోకి వెళ్లిన కార్బోహైడ్రేట్స్ వృధాగా బయటకు పోవడమో, కొవ్వుగా మారడమో జరుగుతుంది. కాబట్టి, శరీరానికి ఉపయోగపడే 25 ముద్దల అన్నమే తిని, మిగతాది కూర ఎక్కువగా తినాలి. ఏ కూరలో అయినా కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి నచ్చిన కూర తినవచ్చు. ఆకు కూరలు ఎక్కువగా తింటే మరీ మంచిది. కూరల వంటకంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. నూనె, మసాలాలు, ఉప్పు, కారాలు ఇప్పుడు వేసినట్లే కూరల్లో వేసి ఎక్కువ కూర తింటే మంచిది కాదు. కూర ఎక్కువగా తింటున్నాం కాబట్టి నూనె, మసాలాలు, ఉప్పు, కారం తక్కువగా వేసి కూరలు వండాలి. ఇలా అయితే కూర ఎక్కువ తినగలుగుతాం.
వీలైనంత త్వరగా రాత్రి భోజనం ముగించాలి
మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి కనీసం నాలుగు గంటల సమయం ఉండాలి. అవకాశం ఉన్న వారు రాత్రి ఏడు గంటలకే భోజనం చేయాలి. ఇలా చేయడం ద్వారా రాత్రి 10 గంటలకు పడుకునే వరకే తిన్న ఆహారం సగం అరిగిపోతుంది. ఇలా పడుకుంటే నిద్ర కూడా బాగుంటుంది. వీలును బట్టి ఎంత త్వరగా రాత్రి భోజనం చేస్తే అంత మేలు. రాత్రిపూట చాలా తేలిగ్గా అరిగిపోయే ఆహారం తినాలి. రాత్రిపూట కేవలం పండ్లు మాత్రమే తింటే ఆరోగ్యానికి మంచిది. అరటి పండు తప్ప మిగతా ఏ పండు అయినా తిరవచ్చు. ఫైబర్ పర్సంటేజ్, వాటర్ ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకొని తినాలి. మూడునాలుగు రకాల పండ్లను సలాడ్‌గా మార్చుకొని తినాలి. ఒకటి, రెండు పండ్లు తిని వదిలేయకుండా కడుపు నిండా తిని పడుకోవాలి. 15 రోజుల పాటు ఈ డైట్‌ను పాటించినట్లయితే మన శరీరం మెరుగవడం కనిపిస్తూనే ఉంటుంది.
రోజుకు రెండు గ్లాసుల జ్యూస్
సాధారణ ఆరోగ్యం ఉన్న వారు ఈ డైట్ పాటిస్తే చాలు. కానీ, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం రెండు గ్లాసుల జ్యూస్‌ను అదనంగా తీసుకోవాలి. టిఫిన్ చేసే అరగంట ముందు ఒక గ్లాస్ జ్యూస్, సాయంత్రం 5 గంటలకు ఒక జ్యూస్ తాగాలి. షుగర్ లేని వాళ్లు క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఇది అద్భుతమైన ఔషదం లాంటి జ్యూస్. పుదీన, కొత్తిమీర, తులసి ఆకులతో చేసిన జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిది. స్త్రీలకు ఈ జ్యూస్ మరీ మంచిది. తౌడుతోనూ జ్యూస్ చేసుకోవాలి. రైస్‌మిల్లుకు వెళ్లి ఫ్రెష్ తౌడు తీసుకొని రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో మూడు స్పూన్ల తౌడు వేయాలి. ఉదయం వరకు తౌడులోని బీకాంప్లెక్స్ నీళ్లలో కలుస్తుంది. ఈ జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిది. మిక్స్‌డ్ వెజిటబుల్ జ్యూస్ కూడా తాగవచ్చు. ఇలా చేస్తే చాలా త్వరగా జబ్బుల నుంచి బయటపడవచ్చు. 15 రోజుల్లోనే ఫలితాలను చూడవచ్చు.