ప్రపంచంలో ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో భారత్ పదో స్థానంలో ఉంది. ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేస్తున్న మొదటి 15 దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలో పప్పుదినుసులు, మసాలాలు, జనపనార, మామడి, అరటిని ఎక్కువగా పండిస్తున్న దేశం మనది. అత్యధికంగా వరి, గోధుము, పండ్లు, కూరగాయు, పత్తి, చెరుకు, నూనె గింజు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశ భూభాగంలో 52 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. సుమారు 60 శాతానికి పైగా దేశ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. వ్యవసాయానికి ఇంతలా ప్రాధాన్యత ఉన్న మన దేశంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ఇందులో వ్యవసాయ భూము వ్యవసాయేతర భూములుగా వేగంగా మారుతుండటం ఇటీవలి కాలంలో మన దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర సమస్యలా మారే అవకాశం ఉంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో వ్యవసాయ భూము విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయి. ఇది ఆహారభద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
పదేళ్ల నుంచే అధికం
తెలంగాణలో 10 – 15 ఏళ్ల కింది పరిస్థితికి, నేటికి చూసుకుంటే ఎంత త్వరగా వ్యవసాయ భూము వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయో అర్థమవుతుంది. ఉదాహరణకు గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కో, కరీంనగర్‌కో, విజయవాడకో, బెంగళూరుకో వెళుతుంటే హైదరాబాద్ శివార్లు దాటగానే రోడ్డుకు ఇరువైపులా పచ్చటి వ్యవసాయ భూములే ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ వ్యవసాయ భూమున్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూము అవుతున్నాయి. ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాకు, మండలాలకు, గ్రామాలకు కూడా వెళ్లడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు ప్లాట్లుగా మారిపోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అభివృద్ధి పనుల కోసం కొంతమేర వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది. దీని ద్వారా వ్యవసాయం నుంచి కాకపోయిన కొంత అభివృద్ధి, జీవనోపాధి లభిస్తోంది. కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూములుగా మారిపోతున్న భూముల వల్ల దేశ వ్యవసాయరంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.
మండల కేంద్రాలకు విస్తరించిన రియల్ ఎస్టేట్
మన రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, వ్యవసాయేతర భూమిగా 22.23 లక్షల ఎకరాలు మారిపోయింది. గత పదేండ్లలోనే 11.95 లక్ష ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయం తగ్గుతూ వస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కేవలం హైదరాబాద్ శివార్లు లేదా జిల్లా కేంద్రాలకే రియల్ ఎస్టేట్ పరిమితం అయ్యేది. ఇప్పుడు హైదరాబాద్‌కు అన్ని వైపులా కనీసం 50 – 60 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడ్డాయి. కేవలం హైవేపై మాత్రమే కాకుండా హైవే నుంచి నాలుగైదు కిలోమీటర్ల లోపలి వరకు వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న 33 జిల్లాల కేంద్రాలకు చుట్టుపక్కల, సగానికి పైగా మండల కేంద్రాల చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధరలు పెట్టి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తామని వస్తుండటంతో రైతులు భూములు అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, వ్యవసాయంలో నష్టాలు వంటి అనేక కారణాల వల్ల భూములను అమ్మేందుకు రైతు మొగ్గు చూపుతున్నారు. ఈ భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చి, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. పెట్టుబడిగా భావించి ఈ ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్లాట్లలో ఎక్కువ శాతం నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించిన రైతు, రైతుకూలీలు ఉపాధికి దూరమవుతారు. వ్యవసాయ భూమి తగ్గిపోవడం ఆహార భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది. మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
వ్యవసాయ జోన్లు ఏర్పాటు చేసిన జపాన్
ఈ విషయంపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యవసాయ భూములు అవసరమైతేనే వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూముగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలి. కొన్ని దేశాలు ఇప్పటికే ఈ సమస్యను గుర్తించి వ్యవసాయ భూములను కాపాడుకుంటూనే అవసరమైన మేర మాత్రమే వ్యవసాయేతర భూములుగా మార్చుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవసాయ భూమి తగ్గకుండా ఆయా దేశాలు నిబంధనలు రూపొందించాయి. ఉదాహరణకు జపాన్‌లో వ్యవసాయానికి యోగ్యమైన భూమి చాలా తక్కువగా ఉంటుంది. ఆ దేశ భూభాగంలో కేవం 33 శాతం భూమి మాత్రమే వ్యవసాయానికి యోగ్యమైన భూమి. ఈ భూమి కూడా వ్యవసాయేతర భూమిగా మారితే వచ్చే సమస్యను గుర్తించింది అక్కడి ప్రభుత్వం. వ్యవసాయానికి, వ్యవసాయేతర రంగాలకు ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ జోన్లలో భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే అవకాశం లేకుండా జపాన్ ప్రభుత్వం నిబంధలను తీసుకువచ్చింది.
రెడ్‌లైన్ పెట్టుకున్న చైనా
పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసే చైనా కూడా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారడం భవిష్యత్‌లో తీవ్ర సమస్యగా మారుతుందని గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూమి 307 మిలియన్ల ఎకరాలకు తగ్గవద్దని ఒక పరిమితిని విధించుకుంది. దీనిని రెడ్‌లైన్‌గా ఆ దేశం పిలుస్తోంది. వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు మార్చడానికి నిబంధలను కఠినతరం చేసింది. వ్యవసాయ భూమిని రైతు ఇతర అవసరాలకు ఉపయోగించకుండా చట్టాలు చేసింది. ఎవరైనా రైతు రెండేళ్ల కంటే ఎక్కువ వారి భూమిని సాగు చేయకుండా బీడుగా ఉంచడానికి వీలు లేకుండా నిబంధలను తెచ్చింది. స్థానికంగా ఇతర అవసరాలకు వ్యవసాయ భూమి అవసరం పడితే అంతే లేదా అంతకన్నా ఎక్కువ భూమిని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను స్థానిక ప్రభుత్వాలపై పెట్టింది. ఇలాంటి కచ్చితమైన నిబంధనలతో చైనా వ్యవసాయ భూమి తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
కచ్చితమైన నిబంధనలే పంటభూములను కాపాడతాయి
ఆహార భద్రతకు, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి ముప్పుగా మారిన ఈ సమస్యకు శాశ్వత, కచ్చితమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారడాన్ని నియంత్రించకపోతే భవిష్యత్‌లో నష్టం తప్పదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు మరిన్ని నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక పరిమితిని విధించుకొని ఆ పరిమితిని దాటి వ్యవసాయ భూమి తగ్గకుండా చూడాలి. ఎడాపెడా భూములు లేఅవుట్‌లుగా మారకుండా అవసరమైనంత వరకే అనుమతులు ఇవ్వాలి. అక్రమ లేఅవుట్‌లను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. నగరానికి దూరంగా వెలుస్తున్న లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వారు అక్కడ నివాసం ఏర్పాటుచేసుకోవాలని అనుకోవడం లేదు. కేవలం పెట్టుబడిగా భావించే వాటిని కొనుగోలు చేసి పెడుతున్నారు. ఇవన్నీ నిరుపయోగంగా మారిపోతున్నాయి. కాబట్టి, లేఅవుట్ల ఏర్పాటుకు నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నివాసయోగ్యత ఉన్న ప్రాంతాల్లోనే లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలి. లేఅవుట్ల ఏర్పాటుకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆ పరిధిలో మాత్రమే లేఅవుట్లు చేసే అవకాశం ఉండాలి. నిరుపయోగంగా ఉండే ప్లాట్లను ప్రజలు పెట్టుబడిగా భావించకుండా చూడాలి. వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూమిగా మార్చే సమయంలో నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ అవసరం కోసం అయితే వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయించుకున్నారో ఆ పనిని పూర్తి చేసేందుకు కాల పరిమితి విధించాలి. ఉదాహరణకు ఎవరైనా ఒక పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయించుకుంటే ఆ పరిశ్రమ ఏర్పాటుకు కాలపరిమితిని విధించాలి. కాలపరిమితిని దాటిన పరిశ్రమ స్థాపించకపోతే ఆ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చేలా నిబంధనలు ఉండాలి.
వివిధ రాష్ట్రాల్లో నిబంధనలు
వ్యవసాయ భూములు తగ్గిపోవడాన్ని ప్రపంచ దేశాల్లోనే కాకుండా మన దేశంలోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు సీరియస్‌గా భావిస్తున్నాయి. వ్యవసాయ భూములు తగ్గిపోకుండా ఉండేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చాయి. అవి విజయవంతంగా అమలవుతున్నాయి కూడా. కర్ణాటక, హిమాయల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ భూములు కేవలం వ్యవసాయదారుడు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండేలా చట్టాలు ఉన్నాయి. సాగుభూమి తగ్గిపోకుండా ఈ చట్టం కాపాడుతుంది. కేరళలో పాడీ ఆండ్ వెట్‌ల్యాండ్ కన్సర్వేషన్ యాక్ట్ – 2008 ప్రకారం వ్యవసాయేతర అవసరాల కోసం గరిష్ఠంగా 10 సెంట్ల భూమిని మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ 10 సెంట్ల భూమిలోనూ 4 సెంట్లలో మాత్రమే ఏదైనా నిర్మాణం చేపట్టాలి అని నిబంధనలు ఉన్నాయి. ఇటువంటి చట్టాలు మరింత మెరుగ్గా తీసుకువచ్చి వ్యవసాయ భూములు తగ్గిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఫిలిప్పిన్స్‌లో సాగుయోగ్యం కానీ భూములే ఇతర అవసరాలకు
వ్యవసాయ భూమి నివాస, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వ్యవసాయేతర అవసరాలకు మళ్లడం వల్ల భవిష్యత్‌లో ఆహార భద్రతకు పెను ముప్పు ఉంటుందని ఇటీవల ఫిలిప్పిన్స్ దేశం గుర్తించింది. ఈ పరిస్థితి రాకుండా చూసుకునేందుకు, ఆ దేశ ఆహార భద్రతకు సరిపడా సాగు భూమి ఉండేలా చూసుకునేందుకు గానూ వ్యవసాయ భూమి విచ్చలవిడిగా ఇతర అవసరాలకు మళ్లించకుండా అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ బాన్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వ్యవసాయ అవసరమయ్యే భూములను, సాగుయోగ్యం కాని భూములను వేరే చేసి కేవలం సాగు యోగ్యం కాని భూములను మాత్రమే వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకునేలా నిబంధనలు మార్చారు.