ప్రకృతి వనరుల పునర్వినియోగమే
ఇంటి పంటకు ఇరుసు
మనకు అందుబాటులో ఉన్న కొద్దిస్థలంలో, ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు పండిరచడం ఒక అవసరం, అనివార్యత. ఒకడుగు ముందుకువేసి ఇంటి నుంచి వెలువడే వ్యర్థాలతో పంటలు పండిరచడం, పంటల వ్యర్థాలను రీయూజ్, రీ సైక్లింగ్ విధానాల్లో తిరిగి ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం ఒక వినూత్న ఆలోచన, విలువైన ఆచరణ.
హైదరాబాద్‌లోని హబ్సిగూడ, కాకతీయనగర్‌లో నివాసం వుంటున్న మండవ వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులు తమ ఇంటి ఆవరణలో సహజ సాగుపద్దతిలో కూరగాయలు పండిస్తూ దీనిని అనేకమైన కొత్త ఆలోచనలకు వేదికగా నిలిపారు. పట్టణంలో ఒక పల్లెను పునఃసృష్టిస్తున్నారు. డీఆర్‌డీఓ లో(కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగం) 30 ఏళ్లపాటు సైంటిస్ట్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వెంకటేశ్వర్లు, తమ ఇంటిని ఆకుపచ్చని ప్రయోగశాలగా మార్చి, తానో పర్యావరణ శాస్త్రవేత్తగా పలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తమకున్న 550 గజాల పెరటిలో టమాట, వంగ, బెండ, చిక్కుడు, కాకర, సొర, పొట్ల, పాలకూర, చుక్కకూర, బచ్చలి, క్యాబేజి, కాలీఫ్లవర్, లెట్యూస్, మునగవంటి పలు కూరగాయలు పండిస్తున్నారు. లేత చిగుళ్లతో నిండిన కరివేపాకు వారి ఇంటి పంటకే ఆకర్షణీయంగా నిలుస్తుంది. మరోవైపు ఎత్తయిన అరటి చెట్లు, ఏపుగా పెరిగిన కొబ్బరి, ఆరోగ్యంగా నిగనిగలాడుతున్న జామ, బత్తాయి, నిమ్మ కనిపిస్తాయి. గోడవారగా పెరిగిన సంపెంగల పరిమళం తోటంతా వ్యాపిస్తుంది. షిరాజ్ ద్రాక్ష గోడకు తీగబారి కాపుకు సిద్ధంగా వుంది.
ఈ తోటలో భార్యా భర్తలిద్దరూ ఆనందంగా పనిచేస్తూ తమ శ్రమఫలాలను పండించుకుంటున్నారు. తోటలో రాలిన ఆకులను, పీకిన కలుపు మొక్కలను, వంటింటి వ్యర్థాలను ఒక దగ్గరచేర్చి, ఒక గుంటలో వేస్తారు. వీటిపై పశువు పేడ వేయడంవల్ల వ్యర్థాలు కుళ్లి సహజ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువుతో వానపాములతో నిండి నేలను సారవంతం చేస్తుంది. ఇలా పండిన పంటలు వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి.