పల్లెటూర్లలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాడుకోవడం బాగా పెరిగిపోయింది. ఇంతకాలం ఇది నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితమైన అంశం. కానీ, ఇప్పుడు ఇంటి స్థాలాల కోసమో, మరో అవసరం కోసమే వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకోవడం విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించి ఒక చట్టం, పద్ధతి ఉన్నా చాలా వరకు ఈ పద్ధతిని పాటించకుండానే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చేస్తున్నారు. దీర్ఘకాలంలో అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడాలనుకుంటే చట్టం ఏం చెబుతోంది, నిబంధనలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఈ సంచికలో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో 1963లో మొదటిసారి వ్యవసాయేతర భూములపై అదనంగా శిస్తు విధించడానికి ఒక చట్టం చేశారు. మళ్లీ 2006లో కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం పేరు వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాల కోసం మార్పు చేసుకునే చట్టం – 2006. ఆంగ్లంలో అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసస్ యాక్ట్ – 2006(నాలా యాక్ట్) అంటారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ఏ రకంగా మార్చుకోవచ్చో చెప్పేది ఈ చట్టం. 2006 ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఈ చట్టానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది.
15 రోజుల్లోనే అనుమతి
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలనుకుంటే భూమి విలువలో రెండు శాతాన్ని కన్వర్షన్ ఫీజుగా చెల్లించి, రశీదుతో సహా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం రోజుల్లో సంబంధిత ఆర్డీఓ ఫీజు తక్కువగా చెల్లించినట్లయితే దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వారంలో సమాచారం కనుక ఇవ్వకపోతే దరఖాస్తుదారుడు తక్కువ ఫీజు కట్టినా సరైనదిగా భావించాలి. ఒకవేళ ఆర్డీఓ తక్కువ ఫీజు కట్టారని వారంలోగా సమాచారం అందిస్తే మిగతా ఫీజును దరఖాస్తుదారుడు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 15 రోజుల్లోగా ఆ భూమిని మొత్తమైనా, పాక్షికంగానైనా కన్వర్షన్ చేస్తూ లేదా దరఖాస్తును తిరస్కరిస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. ఒకవేళ 15 రోజుల్లో ఆర్డీఓ ఇటువంటి సమాచారం ఇవ్వకపోతే ఈ దరఖాస్తు ఆమోదం పొందినట్లేనని చట్టం చెబుతోంది. హైదరాబాద్ కాకుండా మిగతా తెలంగాణ ప్రాంతాల్లో భూమి విలువలో 3 శాతం కన్వర్జేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అనుమతి లేకుండా భారీ జరిమానా
ఒక భూమి కన్వర్షన్ చేయాలంటే ఫీజు చెల్లింపుతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని రకాల భూమిని ఎప్పటికీ కన్వర్షన్ చేయడానికి వీలు ఉండదు. ప్రభుత్వ భూములు, శిఖం భూములను కన్వర్షన్ చేయడానికి వీలు లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో గ్రీన్ జోన్ వంటి జోన్లు ఉంటాయి. అక్కడ నిర్మాణాల నిషేదం ఉంటే కన్వర్షన్‌కు వీలు కాదు. దరఖాస్తుదారుడు భూమికి యజమాని అయి ఉండాలి. యాజమాని కాని వారు కనుక దరఖాస్తు చేసుకుంటే ఆర్డీఓ తిరస్కరించవచ్చు.
కన్వర్షన్ చేయకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకుంటే సమస్యలు తప్పవు. ఒకవేళ ఫీజు చెల్లించకుండా, కన్వర్షన్ కోసం చట్టంలో చెప్పిన పద్ధతి పాటించకుంటే ఆ భూమి కన్వర్షన్ అయినట్లుగానే భావించి కన్వర్షన్ ఫీజును వసూలు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి 2 లేదా 3 శాతం కన్వర్షన్ ఫీజుతో పాటు దానిపై 50 రెట్ల జరిమానాను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉండే భూములకు కన్వర్షన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. స్థానిక సంస్థలు ప్రజల అవసరాల కోసం భూమి వినియోగించుకుంటే ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ, స్థానిక సంస్థలైనా వ్యాపార అవసరాల కోసం కనుక భూమిని వినియోగిస్తే ఫీజు కట్టాల్సి ఉంటుంది. ధార్మిక, మతపరమైన అవసరాల కోసం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగిస్తే ఈ చట్టం వర్తించదు. చేతిపనులు, కులవృత్తులు చేసుకోవడానికి ఎకరానికి మించకుండా వ్యవసాయ భూమిని ఉపయోగించుకుంటే ఈ చట్టం వర్తించదు. కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఆహార భద్రతకు ముప్పు రావచ్చు
ఒకప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకోవాలంటే చాలా పరిమితులు ఉండేవి. సంబంధిత అధికారి అనుమతిపత్రం ఉంటే తప్ప వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. కన్వర్షన్ ఫీజు కూడా 10 శాతం ఉండేది. 2016లో తెలంగాణ ప్రభుత్వం 2 లేదా 3 శాతానికి తగ్గించింది. కాబట్టి, ఇప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వాడుకునేందుకు సరళీకృత పద్ధతితో పాటు తక్కువ ఫీజు ఉంది. పారిశ్రామక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కన్వర్షన్ ప్రాసెస్ అడ్డం కాకుండా ఉండేందుకు, సులభంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే విధంగా ఉండేలా ఈ చట్టాన్ని చాలా సరళీకృతం చేశారు. కానీ, ఈ పద్ధతిని అడ్డం పెట్టుకొని యజమాని కాని వారు కన్వర్షన్ చేయించుకొని ఆ భూమిపై హక్కులు పొందడం, ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ భూములను స్వాదీనం చేసుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఎక్కువ శాతం వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారితే ఫుడ్ సెక్యూరిటీకి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, కన్వర్షన్ అయిన భూమిపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. కన్వర్షన్ అయిన భూముల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడం అవసరమే కానీ ఎలాంటి పరిమితులు లేకుండా పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆహార భద్రతకు ముప్పుగా మారవచ్చు. కాబట్టి, ఈ చట్టం అమలును ప్రభుత్వం భూతద్దం పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది.
- ఎం.సునీల్ కుమార్,
భూచట్టాల నిపుణులు