1 రెవెన్యూ ( శాశ్వత ) రికార్డులు
శాశ్వత భూమి రికార్డుల్లో సేత్వార్/ రీ సెటిల్మెంట్ రిజిష్టర్ , పొలం కొలతల పుస్తకం ( ఎస్ఎంబి ) / టిప్పన్ , గ్రామ నక్షాలు ముఖ్యమైనవి .
రీ సెటిల్మెంట్ రిజిస్టర్ / సేత్వార్ / సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్
జమిందారీలను రద్దుచేసిన ప్రాంతాలలో సర్వే సెటిల్మెంట్ జరిపి సెటిల్మెంట్ శాఖ రూపొందించినదే సెటిల్ మెంట్ ఫెయిర్ అడంగల్ . బ్రిటీష్ ప్రభుత్వం రైత్వారీ విధానాన్ని అమలుపరచిన గ్రామాలలో వారు రూపొందించిన రిజిష్టరు డైగ్లాట్ లేక సెటిల్మెంట్ రిజిష్టరు అని అంటారు . ఇవి రెండూ ఒకే విధమైన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి . అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో సేత్వారు అని అంటారు . ఒక్కొక్క గ్రామానికి సర్వే సెటిల్మెంట్ పూర్తిచేసి వీటిని తయారుచేశారు . అన్ని గ్రామ లెక్కలకు ఇది మూలస్తంభం వంటిది . గ్రామము యొక్క గుడికట్టు అనగా మొత్తం విస్తీర్ణాన్ని ఇది తెలియచేస్తుంది . ఈ రిజిస్టర్లో ఒక రెవెన్యూ గ్రామానికి సంబంధించిన అన్ని రకములు భూముల యొక్క సర్వే నంబర్లు , వాటి వర్గీకరణ , శిస్తు వివరాలు , పంటల వివరాలు , వాటి దిగుబడి , నీటిపారుదల తదితర వివరాలతో సహా పొందుపరచబడి ఉంటుంది .
2 గ్రామ పటం
శాశ్వత ఏ రిజిస్టరు ప్రకారం గ్రామంలోని మొత్తం భూములన్నింటిని రేఖా చిత్రపటంలో చూపించేదే గ్రామ పటం. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ భౌతిక రూపం గ్రామ పటంలో కనిపిస్తుంది. గ్రామంలోని భూములను గుర్తించుటకు గ్రామ పటం ఉపయోగపడుతుంది.