ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పోడు భూములు, అటవీ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అదిలాబాద్ జిల్లాలో ఈ భూములకు సంబంధించి పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులు ఏమిటి ? అటవీ భూములు దున్నుకుంటున్న వారు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి సంబంధించి చట్టాలు ఏమున్నాయి ? వారికి ఎటువంటి హక్కులు ఉన్నాయి ? సమస్యలు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి ? వంటి అంశాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
గిరిజనులకు మేలు చేసే ఆర్వోఎఫ్ఆర్ చట్టం – 2006
అటవీ భూముల విషయానికి వచ్చినట్లయితే స్వాతంత్య్రం రాకముందు, స్వాతంత్య్రం వచ్చాక అడవుల్లో చెట్లను రక్షించడానికి, జీవరాశులను రక్షించడానికి బోలెడు చట్టాలు వచ్చాయి కానీ ఎవరైతే అడవుల్లో నివసిస్తున్న వారికి, అటవీ భూముల మీద ఆధారపడి నివసిస్తున్నారో వారి హక్కులకు ఎప్పుడూ గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోగా ఎవరైనా అటవీ భూములను సాగు చేసుకోవడం, అడవుల్లో నివసించడం చట్టప్రకారం నేరంగా ప్రకటించుకున్నాం. అడవుల్లో మనుషులు ఉండటం అడవికి అపాయం అనే ఒక ఫారెస్ట్ పాలసీతో మన ప్రభుత్వాలు పని చేస్తూ వచ్చాయి. కొన్ని లక్షల గిరిజన కుటుంబాలు అడవులపై ఆధారపడి, అటవీ భూములను సాగు చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి బతుకుతున్నారు. కానీ, వీరెవరికీ చట్టబద్ధంగా హక్కులు లేవు. హక్కులు లేకపోగా అడవులను సాగు చేసుకోవడం నేరంగా పరిగణిస్తూ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2006వ సంవత్సరంలో అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి మేలు చేసేందుకు పార్లమెంటు ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులను గుర్తించిన చట్టం ఇది. అదే ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆండ్ అధర్ ట్రెడీషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ – 2006. ఆర్వోఎఫ్ఆర్, ఎఫ్ఆర్ఏ చట్టం, అడవీ హక్కుల చట్టంగా ఈ చట్టాన్ని పిలుస్తుంటాము. ఈ చట్టం ఉపోధ్ఘాతంలోనే అటవీ భూములను సాగు చేసుకుంటూ అడవుల మీద ఆధారపడి బతుకుతున్న గిరిజనులకు చరిత్రాత్మక అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయడానికే ఈ చట్టం చేస్తున్నట్లు రాసి ఉంటుంది.
సులభ ప్రక్రియలో దరఖాస్తుకు అవకాశం
ఈ చట్టం ఉద్దేశ్యం అటవీ భూములపై ఇప్పటివరకు ఎవరికైతే హక్కులు ఉన్నాయో, ఆ హక్కులను గుర్తించడం. అంటే కొత్తగా ఎవరికీ అటవీ భూములకు హక్కులు కల్పించలేదు. ఎవరైతే అటవీ భూములపై హక్కులు కలిగి ఉన్నారో వారి హక్కులను గుర్తించేందుకు మాత్రమే ఈ చట్టం చేశారు. ఈ చట్టంలో దాదాపు అడవుల్లో వేటాడటం తప్ప అన్ని రకాల హక్కులను గుర్తించే వెసులుబాటు ఉంది. హక్కులు వ్యక్తిగత హక్కులు లేదా సామూహిక హక్కులు పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత హక్కులు అంటే… కొంత భూమిని వ్యక్తిగతంగా సాగు చేసుకుంటున్న వారు పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సామూహిక హక్కులు అంటే.. ప్రజల అవసరాల కోసం ఒక గ్రామం లేదా ఒక పంచాయితీ సామూహికంగా హక్కులు అడగడం. ఎవరికైతే అటవీ హక్కులు ఉన్నాయో వారు దరఖాస్తు చేసుకుంటే హక్కుపత్రం జారీ చేసే అవకాశం ఈ చట్ట ప్రకారం ఉంది. అటవీ హక్కుల చట్టం కింద వ్యక్తిగత హక్కు పత్రం వచ్చినా, సామూహిక హక్కుపత్రం వచ్చినా ఇక ఆ భూములను వాడుకోవడానికి చట్టబద్ధంగా హక్కు వచ్చినట్లే. ఈ భూమిని వాడుకుంటున్న వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలులేదు. హక్కు పత్రాలు పొందడానికి ఈ చట్టం ఒక సులభమైన పద్ధతిని నిర్ధారించింది. దీని ప్రకారం.. 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారు లేదా సామూహిక హక్కుల కోసం గ్రామ సభకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ పంచాయితీ పరిధిలో గ్రామసభ ఏర్పాటు చేసి అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేయాలి. దరఖాస్తులు గ్రామసభకు కానీ, అటవీ హక్కుల కమిటీకి కానీ చేసుకుంటే ఆ కమిటీ నిజంగానే భూమి దరఖాస్తుదారు సాగులో ఉందా అనేది విచారణ చేస్తుంది. దరఖాస్తుతో పాటు రెండు సాక్ష్యాలు కూడా దరఖాస్తుదారు జత చేయాల్సి ఉంటుంది. సాక్ష్యాలు అంటే.. భూమి సాగు చేసుకుంటున్నట్లు రెవెన్యూ రికార్డులు లేదా ఏవైనా హక్కుపత్రాలు, పట్టాల్లో పేర్లు ఉంటే సాక్ష్యంగా పనికి వస్తుంది. ఒకవేళ ఇలాంటి పత్రాలు ఏమీ లేకపోతే గ్రామంలో ఇద్దరు పెద్దలతో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే సాక్ష్యంగా పనికొస్తుంది. అటవీ హక్కుల కమిటీ విచారణలో దరఖాస్తుదారుకు హక్కులు ఉన్నట్లు గుర్తిస్తే గ్రామసభకు నివేదిక ఇస్తుంది. గ్రామసభలో ఎవరెవరికి హక్కులు ఉన్నాయి, ఎంత భూమిపై హక్కులు ఉన్నాయనే సిఫార్సులను సబ్ డివిజన్ లెవల్ కమిటీ(ఎస్‌డీఎల్‌సీ)కి పంపించాలి. ఆర్డీఓ, కొంత మంది ప్రజాప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గ్రామసభలు పంపిన సిఫార్సులను స్క్రూటినీ చేసి సరిగ్గా ఉన్నవి జిల్లా లెవల్ కమిటీ(డీఎల్‌సీ)కి పంపించాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఈ కమిటీలో ఉంటారు. ఎస్‌డీఎల్‌సీ నివేదికను పరిశీలించి ఈ కమిటీ అర్హులైన వారికి హక్కుపత్రాలు జారీ చేస్తుంది. ఒకసారి హక్కుపత్రం జారీ చేసినట్లయితే.. హక్కుదారులు నిరభ్యంతరంగా వారు పొందిన అటవీ భూమిని అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ హక్కుల వివరాలను గ్రామసభకు కూడా పంపిస్తారు. గ్రామసభలో అటవీ హక్కుల రిజిస్ట్రర్ ఉంటుంది. అందులో ఈ వివరాలను నమోదు చేస్తారు.
సగం దరఖాస్తుల తిరస్కరణ
ఒకవేళ గ్రామసభ దరఖాస్తు తిరస్కరిస్తే సబ్ డివిజనల్ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ కూడా తిరస్కరణకు గురైతే జిల్లా స్థాయి కమిటీకి దరఖాస్తు చేయాలి. అక్కడ కూడా తిరస్కరిస్తే నేరుగా రాష్ట్రస్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి విషయానికి వస్తే.. డిసెంబర్ 13, 2005 నాటికి ఎవరైనా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నట్లయితే పది ఎకరాలకు మించకుండా వారి ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి హక్కు పత్రం మంజూరు చేయాలి. పార్లమెంటులో ఈ చట్టం ప్రవేశపెట్టిన డిసెంబర్ 13, 2005నే కటాఫ్ డేట్‌గా పెట్టారు. ఒకవేళ గిరిజనేతరులు అయితే డిసెంబర్ 13, 2005కు ముందు మూడు తరాలుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండాలి అనే నిబంధన పెట్టారు. ఒక తరం అంటే 25 ఏళ్లు అని చట్టంలో చెప్పారు. మూడు తరాలు అంటే 75 ఏళ్లుగా అంటే 1930 నుంచి వారి ఆధీనంలో ఉంటే గిరిజనేతరులు కూడా హక్కుపత్రం పొందే అవకాశం ఇచ్చింది ఈ చట్టం. నివాస స్థలాల విషయానికి వస్తే.. అటవీ భూమిలో ఇళ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నట్లయితే వారు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకొని హక్కుపత్రం పొందవచ్చు. కాలిబాటలు, బండ్లబాటలు, చాపల చెరువులు వంటి వాటికి సామూహికంగా హక్కు పత్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ చట్టం కింద సుమారు రెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2008 నుంచి నేటి వరకు తెలంగాణలో 93 వేల మందికి ఈ చట్టం కింద హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో దాదాపు 60 శాతం దరఖాస్తుదారులకు హక్కుపత్రాలు ఇవ్వలేదు. అవి తిరస్కరణకు గురై ఉండాలి లేదా తిరస్కరణకు గురైన విషయం దరఖాస్తు దారులకు తెలియజేయనివి ఉండవచ్చు. ఇది ఒక సమస్య అయితే హక్కుపత్రాలు వచ్చిన వారికి కూడా వారి ఆధీనంలో ఉన్న పూర్తి విస్తీర్ణం వరకు కాకుండా తగ్గించి హక్కులు ఇవ్వడం రెండో సమస్య. అంటే నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటున్న గిరిజనుడికి రెండు ఎకరాలకే హక్కు పత్రం ఇవ్వడం వంటి సమస్యలు.
సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు
ఇటీవల సుప్రీం కోర్టు ఈ విషయమై ఒక కీలక ఆదేశం ఇచ్చింది. ఎవరెవరి హక్కుపత్రాల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయో వారిని అటవీ భూముల నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఆపాలని సుప్రీంకోర్టును కోరింది. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు ఇంకా ఎందుకు భూములను ఆధీనం ఎందుకు ఉంచుకోవాలి, వారి ఆధీనం నుంచి భూములను తొలగించాలి అనేది సుప్రీం కోర్టు ఆదేశం. కానీ, తిరస్కరించింది అని ప్రభుత్వం చెబుతోంది కానీ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం గిరిజనులకు రాతపూర్వకంగా తెలియజేయలేదు. దీంతో వారు అప్పీల్ చేసుకునే అవకాశం రాలేదు. అప్పీల్‌కు అవకాశం దొరకనప్పుడు వారిని తోలగిస్తే అన్యాయం జరుగుతుందనేది ఒక వాదన. గిరిజనులు తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నందున వారిని అటవీ భూముల నుంచి తొలగించవద్దని, వారందరికీ హక్కులు ఇవ్వాలనేది దేశవ్యాప్తంగా ఉన్న మరో డిమాండ్.
గిరిజనులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు..
1. 2005, డిసెంబర్ 13 నాటికి అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు కొందరు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. చట్ట ప్రకారం ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా గ్రామసభ ఈ దరఖాస్తులు తీసుకోవచ్చు.
2. హక్కుపత్రం వచ్చినా సాగులో ఉన్న పూర్తి విస్తీర్ణానికి కాకుండా కొంత విస్తీర్ణానికే హక్కుపత్రం రావడం. ఇటువంటి వారందరి దరఖాస్తులను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.
3. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరస్కరణ విషయం, ఎందుకు తిరస్కరణకు గురైందో రాతపూర్వకంగా తెలియచేయాల్సి ఉంది. వారికి అప్పీల్‌కు అవకాశం ఉండాలి.
4. ఇప్పటికీ అడవులు నరికేసి పోడు భూములుగా మారుస్తున్నారు. చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13 తర్వాత అటవీ భూములను కొత్తగా సాగులోకి తీసుకురావడం నేరం. కాబట్టి వీటి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
యధేచ్ఛగా ఎల్‌టీఆర్ చట్టం ఉల్లంఘనలు
తెలంగాణలోనే దాదాపు నాలుగైదు లక్షల ఎకరాల భూమి రెవెన్యూ భూమినా లేదా అటవీ భూమినా అనేది తెలియని గందరగోళం ఉంది. కొన్ని సందర్భాల్లో భూమిలేని పేదలకు ఈ భూములను రెవెన్యూ శాఖ అసైన్‌మెంట్ చేయడం జరిగింది. అసైనీలు సాగులోకి వెళ్లినప్పుడు అటవీ శాఖ వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఈ విషయమై పలు కమిటీలు ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సరిహద్దులను నిర్ధారించుకోవాలి అని సూచించాయి. ఈ నిర్ధారణ జరిగే వరకు ఏదైతే వివాదంగా ఉన్న భూమిని సాగు చేసుకుంటున్న వారికి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతోంది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ రెండూ జరగకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ భూమిగా భావించబడ్డ భూముల విషయంలోనూ మరో సమస్య ఉంది. అటవీ చట్టం ప్రకారం ఏదైనా భూమిని అటవీ భూమిగా మార్చే అవకాశం ఉంటుంది. ఫలానా భూమిని అటవీ భూమిగా మారుస్తున్నాము అంటూ సెక్షన్ 4 నోటిఫికేషన్ జారీ చేస్తుంది అటవీ శాఖ. ఆ తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అక్కడున్న వారి హక్కులను నిర్ధారించి, సెటిల్ చేసి అంతిమంగా సెక్షన్ 15 నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చాకనే అటవీ భూమిగా మారుతుంది. ఉమ్మడి ఏపీలో సుమారు ఆరేడు లక్షల భూమికి సంబంధించి సెక్షన్ 4 నోటిఫికేషన్ మాత్రమే జారీ అయ్యింది. కానీ, ఇప్పటికే ఈ భూమిని అటవీ శాఖ అటవీ భూమిగానే భావిస్తోంది. ఈ భూముల్లో చాలామందికి హక్కులు ఉన్నాయి. ఇప్పటికైనా సెటిల్మెంట్ అధికారిని నియమించి ఇటువంటి భూముల్లో సెటిల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి. సెటిల్మెంట్ అయ్యే వరకు ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు ఇవ్వొచ్చు. గిరిజనులకు సంబంధించి మరో కీలక సమస్య.. ఎల్‌టీఆర్ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలోని భూములు గిరిజనులు మాత్రమే కొనుగోలు చేయాలి లేదా అనుభవించాలి కానీ గిరిజనేతరులు అనుభవించకూడదు. షెడ్యూల్ ప్రాంతాల్లో.. ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం ఏజెన్సీలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఎవరైనా ఈ ఎల్‌టీఆర్ చట్టం ఉల్లంఘించి గిరిజనేతరులు భూములు కొన్నట్లయితే ఆ భూములు తిరిగి గిరిజనులకు అప్పగించాలి. ఈ చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు ఈ చర్యలు తీసుకోవాలి. ఈ తీర్పులపై ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. పీఓ, ఐటీడీఏ తీర్పుపైన ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ చట్టం అమలు తీరు పరిశీలిస్తే 1959 నుంచి 2004 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 76 వేల కేసులు ఈ చట్టం ఉల్లంఘనకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో సగం కేసుల్లో గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. గిరిజనులకు అనుకూలంగా తీర్పులు వచ్చిన కేసుల్లోనూ తీర్పులు వచ్చాయి కానీ గిరిజనులకు భూములు మాత్రం తిరిగి అప్పగించలేదు. మరో సమస్య ఏంటంటే.. అసలు జరుగుతున్న ఎల్‌టీఆర్ ఉల్లంఘనల్లో 10 శాతం కూడా కోర్టుల దృష్టికి రావడం లేదు. ఉమ్మడి ఏపీలో కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో 51 శాతం భూమి గిరిజనేతరుల చేతుల్లో ఉంది. ఇది ఇంకా పెరుగుతూ పోతోంది. గిరిజనులకు అవగాహన లేకపోవడం, గిరిజనుల పక్కన నిలబడే ఒక న్యాయపరమైన యంత్రాంగం లేక వారికి న్యాయ సహాలు అందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాబట్టి గిరిజనులకు వారికి ఉన్న హక్కులు, ఎల్‌టీఆర్ చట్టం గురించి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా ప్రతి ఐటీడీఏ పరిధిలో పేద గిరిజన కుటుంబాలకు న్యాయ సలహాలు అందించే వ్యవస్థను బలోపేతం చేయాలి.