అధీకృత కౌలుదార్ల చ‌ట్టం

March 20, 2020

అధీకృత కౌలుదార్ల చ‌ట్టం
కౌలుకు భూమిని దున్నే వారికి గుర్తింపుగా లైసెన్సుడు కల్టివేటరు కార్డు ప్రవేశపెట్టబడింది . ప్రచారమైతే జరిగింది . కార్డుగల రైతుకు పంట రుణాలివ్వమని బ్యాంకుల్ని ఆదేశించారే గాని కౌలు రైతును చూసిన బ్యాంకులు ముఖం తిప్పేసుకున్నై , కౌలుకు భూమి సేద్యం చేసే వ్యక్తి పేరు ఎక్కడా రికార్డుల్లో నమోదు కావద్దని , అదే భూమిపై యజమాని తన పాసు బుక్కును చూపితే దీర్ఘకాలిక రుణం బ్యాంకు లివ్వవచ్చని చట్టంలో పేర్కొనటం జరిగింది . ప్రకృతి వైపరీత్యంవల్ల పంట నష్టపోతే పరిహారం కార్డుగల వ్యవసాయదారుకే చెల్లించాలని నియమం పెట్టబడింది . కాని కౌలుదారుగా రికార్డుల్లో పేరులేని వారికి నష్టపరిహారం చెల్లించటానికి అధికార్లు సాహసించలేదు . సరికదా మంజూరు చేయదగ్గ పరిహారం భూమి యజమానికి చెల్లించమని కూడా వత్తిడి ఎదుర్కొన్నారు . ఇటు పంట రుణం బ్యాంకుల నుండి పొందలేక అటు పంట నష్టం ప్రభుత్వం నుండి పొందలేక కౌలు రైతు నిస్సహాయంగా మిగిలిపోతున్నాడు . కేంద్ర ప్రభుత్వ సంస్థ “ నీతి అయోగ్ ” వారు కౌలు వ్యవహారాన్ని అధ్యయనం చేశారని , వారు నిర్దిష్టమైన నివేదిక | వెలువరించారని తెలుస్తున్నది . గతంలో వచ్చిన ” లైసెన్సుడు కల్టివేటర్సు చట్టం ” ప్రకారం కౌలు అనేదానికి చట్టబద్ధత లేదని తేల్చారు . అంతేగాక వారొక నమూనా చట్టాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించుకొని అమలు చేస్తే మంచి ఫలితాలుంటాయని తెలియజేశారు . నమూనా చట్టంలోని కొన్ని అంశాలు ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తున్నవి .