మహిళలు – భూమి హక్కులు

March 20, 2020

మహిళలు – భూమి హక్కులు….
భూమి రికార్డుల్లో జెండర్ కాలము చేర్చాలి 

ప్ర‌తి సంవత్సరం అక్టోబరు 15వ తేదీ ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము . 1998 నుంచి ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 15ను ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు . 2008 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తుంది . గ్రామీణ అభివృద్ధి , వ్యవసాయము , అహారభద్రత మరియు పేదరిక నిర్మూలనలో మహిళల పాత్రను గుర్తిస్తూ ఈ రోజును జరుపుకుంటాము . వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంది . ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో 43 శాతం మంది మహిళలే . ఆఫ్రికా , ఆసియా ఖండాలలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో 60 శాతం – 70 శాతం మంది మహిళలే . అయినా మహిళా భూమి యజమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 20 శాతం దాటలేదు . మన దేశంలో మహిళా భూ యాజమానులసంఖ్య 10 – 15 శాతం మాత్రమే ఉంటుందని అంచనా . వారసత్వ చట్టంలో మార్పులు చేసినా , భూ పంపిణీ మహిళల పేరునే చేయాలని ఆదేశాలు జారీచేసిన మహిళా భూ యజమానుల సంఖ్య అశించినంత పెరగకపోవడానికి ఎన్నో కారణాలు . అసలు మహిళల పేరుమీద ఎంత భూమి ఉందనే లెక్కలే సరిగా లేవు . భూమి రికార్డులలో భూ యజమాని యొక్క జెండర్ నమోదు కావటం లేదు . ఈ నేపథ్యంలో భూ యజమాన్య సాగు లెక్కలు పురుషులు మరియు మహిళల వారీగా విడిగా ఉండాలనే చర్చ విస్తృతంగా జరుగుతుంది . ఎన్నో కమిటీలు ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి . ప్రణాళిక సంఘం 12వ పంచవార్షిక ప్రణాళిక మధ్యంతర సమీక్షలో ఈ అంశాన్ని చర్చించింది . మహిళల భూమి హక్కులను , మహిళకు హక్కులు కల్పిస్తూ చేసిన వారసత్వ చట్టాల అమలును కేంద్ర భూ వనరుల శాఖ మరియు స్త్రీ , శిశు సంక్షేమ శాఖ సమీక్షించాలని సూచించింది . ఇందుకు అనుకూలంగా కేంద్ర భూ వ‌న‌రుల శాఖ (Department of Land Resources)1-08-2014 నాడు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ వ్రాసింది. అన్ని రాష్ట్ర‌లు త‌మ భూమి రికార్డుల్లో జెండ‌ర్ కాల‌మ్‌ను చేర్చి మహిళల భూమి హక్కుల లెక్కలు సేకరించాలని సూచించింది . ఇలా చేయడం వలన మహిళల సామాజిక , ఆర్థిక సాధికారిక దోహదం చేస్తుందని పేర్కొంది . కేంద్రప్రభుత్వం సూచనలను అనుసరించి ఇటీవలే ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓఆర్‌ రికార్డులో జెండర్ కాలమ్ చేర్చాలని ఆదేశాలు జారీచేసింది . ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది . తెలంగాణ రాష్ట్రంలో కోడా వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకంగా ఉంది . మహిళా సాగుదారులు , మహిళా వ్యవసాయ కార్మికులు ఎక్కువ శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా భూమి రికార్డుల్లో జెండర్ కాలమ్ చేర్చితే మహిళా సాధికారత దిశగా గొప్ప ముందడుగు పడినట్లే . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రికార్డుల సవరణల కార్యక్రమంలో భాగంగానే పట్టాదారుల జెండర్ను రికార్డుల్లో నమోదు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది . అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం భూమి రికార్డులు తగ్గించడానికి , ఆ రికార్డుల్లోని కాలము మార్చడానికి విస్తృతంగా కసరత్తు చేస్తుంది . ఇందులో భాగంగానే భూ రికార్డుల్లో జెండర్ కాలమ్ చేర్చితే మహిళలకు మేలు జరుగుతుంది . తెలంగాణ రాష్ట్రం ఈ అంశంలో కూడా అదర్శంగా నిలుస్తుంది .